


శ్రీ రామకృష్ణ ఉద్యమం
శ్రీ రామకృష్ణ, శ్రీ శారదా దేవి మరియు స్వామి వివేకానంద సందేశం చాలా సార్వత్రికమైనది, చాలా అవకాశాలతో నిండి ఉంది, మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అది కేవలం ఒక ఛానెల్, సంప్రదాయం లేదా సంస్థకు మాత్రమే పరిమితం కాదు. వాస్తవానికి ఇది ఒక సంస్థకే పరిమితం కాకుండా, సంస్థల పరిధులను దాటి, ప్రపంచవ్యాప్త ఉద్యమంగా, లేదా అమెరికన్ చరిత్ర ప్రొఫెసర్ కార్ల్ T. జాక్సన్ చెప్పినట్లుగా. "ఆధునిక చరిత్ర యొక్క మెగా-ధోరణులలో ఒకటి" గా రూపొందింది. ఈ ఉద్యమం యొక్క ప్రత్యేకతలలో ఒకటి సన్యాసులు మరియు సామాన్య భక్తుల మధ్య పరస్పర ప్రేమ మరియు గౌరవ స్ఫూర్తితో సన్నిహిత సహకారం. ఉద్యమంలో ఉన్న సామరస్య స్ఫూర్తి వివిధ కులాలు, మతాలు మరియు జాతులకు చెందిన ప్రజలు సహోదరులుగా కలిసి జీవించడానికి వీలు కల్పించడం మరొక ప్రత్యేక లక్షణం.
అనుబంధం లేని కేంద్రాలు:
శ్రీరామకృష్ణుని సామాన్య భక్తులు భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో మరియు ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాలలో కనిపిస్తారు. వారు ఎక్కడ ఉన్నా, వారు సమూహాలుగా ఏర్పడి ఆశ్రమాలు, అధ్యయన కేంద్రాలు (స్టడీ సర్కిల్‌లు) మొదలైనవాటిని ప్రారంభిస్తారు. ఈ కేంద్రాలలో చాలా వరకు శ్రీరామకృష్ణునికి అంకితమైన ఆలయాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో కొన్ని మొదట శ్రీరామకృష్ణుల శిష్యులు లేదా ప్రశిష్యుల (శిష్యుల శిష్యులు) ప్రభావంతో ప్రారంభించబడ్డాయి. ఈ కేంద్రాలలో ఎక్కువ భాగం సామాన్య భక్తులచే నిర్వహించబడుతున్నాయి, మరియు రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. భారతదేశంలో అటువంటి అనుబంధం లేని కేంద్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి.
ఈ అనుబంధం లేని కేంద్రాలు రామకృష్ణ మిషన్ యొక్క ఆదర్శాలు మరియు సూత్రాలను చాలా వరకు అనుసరిస్తాయి- ఉదాహరణకు “ఆత్మనో మోక్షార్థం జగద్ హితాయచ”, అంటే "స్వంత మోక్షం కోసం మరియు ప్రపంచ హితం కోసం". ఈ సంస్థలు కూడా రామకృష్ణ మిషన్ నిర్వహించే కార్యకలాపాల మాదిరిగానే - పాఠశాలలు, హాస్టళ్లు, అనాథ శరణాలయాలు, అనధికారిక పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, డిస్పెన్సరీలు, మొబైల్ మెడికల్ యూనిట్లు, గ్రామీణాభివృద్ధి పనులు నిర్వహించడం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం చేస్తుంటాయి. ఈ కార్యకలాపాలు “శివ జ్ఞానే జీవ సేవ” ("మానవ సేవయే మాధవ సేవ"), మరియు "దైవారాధనగా కార్యకలాపాలు" అనే సూత్రం ఆధారంగా నిర్వహించబడతాయి.
భావ ప్రచార కమిటీ:
కార్యక్రమాలలోని ఈ సారూప్యత కారణంగా ఈ అనుబంధం కాని కేంద్రాలను రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ ల ప్రధాన స్రవంతికి దగ్గరగా తీసుకురావాల్సిన అవసరం చాలా సంవత్సరాలుగా ఉంది. ఈ దిశలో మొదటి అడుగుగా 1980లో రామకృష్ణ మఠం, బేలూరు మఠం ల ప్రధాన కార్యాలయంలో “భావ ప్రచార కమిటీ” అని పిలువబడే ఒక ప్రధాన (అపెక్స్ )కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రామకృష్ణ ఆర్డర్ కు చెందిన సీనియర్ సన్యాసులు ఉంటారు. ఈ కమిటీకి ఎక్స్-అఫీషియో చైర్మన్ గా రామకృష్ణ మఠం యొక్క జనరల్ సెక్రటరీ, మరియు కన్వీనర్ గా మరొక సీనియర్ సన్యాసి ఉన్నారు. ఈ కమిటీ కేవలం సలహాదారు హోదాలో మాత్రమే పనిచేస్తుంది.
భావ ప్రచార పరిషత్తులు:
ప్రధాన కార్యాలయంలోని భావ ప్రచార కమిటీ యొక్క మార్గదర్శకత్వంలో, “భావ ప్రచార పరిషత్” అని పిలువబడే సామాన్య భక్తుల సమన్వయ కమిటీలు భారతదేశంలో ఏర్పడ్డాయి. ప్రతి భావ ప్రచార పరిషత్ దానికి సంబంధించిన ప్రాంతంలోని ప్రతి అనుబంధించని సభ్య కేంద్రం నుండి ఇద్దరు ప్రతినిధులతో ఏర్పాటవుతుంది. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో 10 వ్యక్తిగత కేంద్రాలు ఉంటే, ఆ ప్రాంతంలోని భావ ప్రచార పరిషత్‌లో 20 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యుల నుండి, పరిషత్ అధ్యక్షుడు ఒక కన్వీనర్‌ను నామినేట్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పనులన్నీ అతనే చేస్తాడు. ప్రతి పరిషత్‌కు ఒక అధ్యక్షుడు, మరియు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యక్షులు ఉంటారు, వీరు బేలూర్ మఠం ప్రధాన కార్యాలయంలోని భావ ప్రచార కమిటీచే నామినేట్ చేయబడిన సన్యాసులు.
భావ ప్రచార పరిషత్తుల విధులు:
భావ ప్రచార పరిషత్ మూడు ప్రధాన విధులను కలిగి ఉంటుంది.
- ఇది సన్యాసులు మరియు సామాన్య భక్తుల మధ్య, అంటే, రామకృష్ణ మఠం యొక్క ప్రధాన కార్యాలయంలోని సన్యాసులతో కూడిన భావ ప్రచార కమిటీ, మరియు నిర్దిష్ట ప్రాంతంలోని అనుబంధించని ఆశ్రమాల సభ్యుల మధ్య, అనుసంధానాన్ని కలుగజేస్తుంది.
- భావ ప్రచార పరిషత్ దానికి సంబంధించిన ప్రాంతంలోని అనుబంధించని సభ్య కేంద్రాల పనిని సమన్వయం చేస్తుంది, మరియు ఆ కేంద్రాలు వారి వారి సమస్యలను చర్చించడానికి మరియు వారి అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది.
- ప్రతి భావ ప్రచార పరిషత్ దాని పరిధిలోని అనుబంధించని సభ్యుల ఆశ్రమాల పనితీరుపై ను పరిశీలిస్తూ ఉంటుంది. మరియు వారు రామకృష్ణ ఉద్యమం యొక్క ఆదర్శాలు మరియు సూత్రాలను అనుసరిస్తున్నారో లేదో గమనిస్తుంది.. బేలూరు మఠంలోని అపెక్స్ కమిటీ (భావ ప్రచార కమిటీ) అనుబంధించని సభ్యుల కేంద్రాల కోసం 10 మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. ప్రతి భావ ప్రచార పరిషత్ దాని క్రింద ఉన్న అన్ని సభ్య ఆశ్రమాలు ఈ మార్గదర్శకాల పరిధిలో పని చేసేలా చూస్తుంది. ఈ పది పాయింట్ల మార్గదర్శకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
పది పాయింట్ల మార్గదర్శకాలు:
రామకృష్ణ-వివేకానంద భావ ప్రచార పరిషత్‌లో సభ్యత్వానికి అర్హత పొందేందుకు, అనుబంధించని కేంద్రం (కొన్నిసార్లు "ప్రైవేట్ సెంటర్" గా సూచించబడుతుంది,) ఈ క్రింది నియమాలకు కట్టుబడి ఉండాలి:
- ప్రైవేట్ సెంటర్‌ను మతపరమైన ట్రస్ట్‌గా మరియు/లేదా సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదు చేయాలి. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ యొక్క ఆధ్యాత్మిక, నైతిక ఆదర్శాలు మరియు సూత్రాలను తప్పనిసరిగా అనుసరించాలి. అంతేకాకుండా మరియు రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్‌ల తరహాలో వాటి కార్యకలాపాలను నిర్వహించాలి.
- ప్రైవేట్ సెంటర్‌కి రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్‌తో సన్నిహిత సంబంధం మరియు విశ్వసనీయ వైఖరి ఉండాలి.
- ప్రైవేట్ సెంటర్ నిర్వహణ కమిటీ సభ్యులకు (ఆ కమిటీని ఏ పేరుతో పిలిచినా) రాజకీయాలు లేదా రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ ఆమోదించని వర్గాలు మరియు సంస్థలతో సభ్యులకు ఎటువంటి సంబంధం ఉండకూడదు.
- ఏ కారణం చేతనైనా (ఆరోగ్య కారణాల మినహా ) రామకృష్ణ ఆర్డర్ ను విడిచిపెట్టిన ఏ స్వామిని కూడా ప్రైవేట్ సెంటర్‌లో ఉండడానికి లేదా సంస్థతో సంబంధం పెట్టుకోవడానికి అనుమతించకూడదు.
- ప్రైవేట్ సెంటర్ తన ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి సరైన రికార్డులు మరియు ఖాతాల పుస్తకాలను నిర్వహించాలి, వీటిని చార్టర్డ్ అకౌంటెంట్లతో ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించాలి.
- ప్రైవేట్ కేంద్రం, దాని ఇతర కార్యకలాపాలతో పాటు, పరిసరాలలోని పేదలకు కొంత సామాజిక సేవను అందించాలి.
- ప్రైవేట్ కేంద్రం గ్రామీణ హరిజనులు, గిరిజనులు మరియు ఇతర వెనుకబడిన వర్గాల కోసం కొన్ని సంక్షేమ పనులను చేపట్టాలి.
- ప్రయివేటు కేంద్రం స్థానిక యువతపై దృష్టి సారించాలి. వారిని ఉత్సాహపరచడానికి వారం లేదా రెండు వారాలకొకసారి స్టడీ సర్కిల్‌లు (సామూహిక అధ్యయనాలు), మరియు వ్యాసరచన, పారాయణం, సంగీతం, వక్తృత్వం మొదలైన వాటిలో వార్షిక పోటీలు నిర్వహించవచ్చు. ఎదిగిన అబ్బాయిలు మరియు అమ్మాయిలకు వేరువేరుగా స్టడీ సర్కిల్‌లను నిర్వహించాలి. స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12వ తేదీని భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది, దీనిని ప్రతి కేంద్రం తప్పనిసరిగా నిర్వహించాలి.
- భారత శాస్త్ర గ్రంథాలపై తరగతులు నిర్వహించడంతో పాటు, రామకృష్ణ-వివేకానంద ఉద్యమ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ప్రచారం చేసేందుకు రామకృష్ణ-వివేకానంద సాహిత్యాన్ని, పుస్తకాలను విక్రయించే కేంద్రం ఏర్పాటు చేయాలి. అంతేకాదు, ప్రతి కేంద్రంలో రామకృష్ణ-వివేకానంద సాహిత్యంపై తగిన సంఖ్యలో పుస్తకాలతో కూడిన గ్రంధాలయం ఉండాలి.
- సందర్భం వచ్చినప్పుడల్లా, ప్రవేటు కేంద్రం విపత్తులతో బాధపడుతున్న ప్రజలకు సహాయ సేవలను అందించాలి. ఇది స్వతంత్రంగా లేదా మఠం మరియు మిషన్ మార్గదర్శకత్వంలో చేయవచ్చు.
పరిషత్ పరిధిలోని కేంద్రాలు సంయుక్తంగా వార్షిక వేడుకలను నిర్వహించాలి. రొటేషన్ పద్దతి ద్వారా వార్షిక వేడుకలను నిర్వహించే బాధ్యతను ప్రముఖ కేంద్రాలు తీసుకోవచ్చు. సాంప్రదాయ పూజలు, ఆరాత్రికం, ప్రసాద వితరణ మరియు శాస్త్ర ప్రసంగాలతో పాటు, యువత మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించవచ్చు. వివిధ కేంద్రాలలో జరిగే పఠనం, వక్తృత్వం, సంగీతం మొదలైన పోటీలు ఇక్కడ తదుపరి స్థాయిలో నిర్వహించి ముగించవచ్చును. ఒక ఉదయం, వేడుక జరిగే పట్టణం/గ్రామంలోని వీధుల గుండా భక్తులు, స్థానిక పాఠశాలల మరియు కళాశాలల బాలబాలికలతో ఊరేగింపును నిర్వహించవచ్చు. ఈ ఊరేగింపు తర్వాత ఒక చిన్న బహిరంగ సభ జరగాలి.